
దక్షిణపథ స్టడీ సర్కిల్, వైశాఖ శుద్ధ సప్తమి అనగా మే నెల 14 వ తేదీన, సికిందరాబాద్ లోని తమ కార్యాలయములో శ్రీ విద్యారణ్యుల జయంతోత్సవమును ఘనంగా నిర్వహించినది. ఈ ఉత్సవముతోపాటే వైశాఖ శుద్ధ పంచమిన జన్మించిన జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతినీ, అదే పంచమీ తిథి, అరుద్రా నక్షత్రంలో జన్మించిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల జయంతినీ కూడా జరిపింది.
కార్యక్రమాన్ని సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్ శ్రీమతి శైలజ గారు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ విద్యారణ్యుల గురించి శ్రీమతి శైలజ గారు ప్రసంగిస్తూ, నేటి వరంగల్ ప్రాంతంలో ఒక సామాన్య సంప్రదాయ కుటుంబంలో జన్మించిన మాధవాచార్యుడనే కుర్రవాడు దైవానుగ్రహంతో శృంగేరీ పీఠాధిపతుల చెంత చేరడం, వారు ఆ కుర్రవాడికి దీక్షాధారణ చేయించడం, ఆ పిమ్మట పరివ్రాజకుడై, ఆ యువకుడు కాశీ చేరడం, అక్కడ స్వయంగా శ్రీ వేదవ్యాసులవారే అతనికి సన్యాస దీక్ష ఇప్పించి విద్యారణ్యుడిగా కరుణించడం వెనుక బలీయమైన దైవ నిర్ణయం ఉందని తెలిపారు. విద్యారణ్యులు అపార జ్ఞాన సముపార్జన చేసి అనేక గ్రంధాలూ, భాష్యాలూ రాసినారని, కాలక్రమంలో శృంగేరీ పీఠాన్ని అధిరోహించడం జరిగిందనీ చెప్పారు. శృంగేరీ పీఠాధిపతులుగా వారు, నాడు జరుగుతున్న ముస్లిం దండయాత్రలూ, దూరాగతాలకు కలత చెంది, హిందూ ధర్మ పునః ప్రతిష్టకై కంకణ బద్ధులైనారు. అదే సమయంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ వద్ద ఇస్లాం లోకి మతాంతరీకరణ చేయబడిన ఇరువురు వీరులు, హరిహర రాయలు బుక్కరాయలు అను వారిని చేరదీసి, వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చి, హంపీ నగర కేంద్రంగా విజయనగర రాజ్యాన్ని నిర్మింపచేశారు. కాలక్రమంలో ఈ విజయనగర రాజ్యమే ఒక మాహాసామ్రాజ్యమై, హిందూ మత పునర్వైభవాన్ని నాలుదిక్కులా చాటిచెప్పిందని శ్రీమతి శైలజ గారు తెలిపారు. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో మహ్మదీయుల దండయాత్రలను నిలువరించి, హిందూ మహాసామ్రాజ్య స్థాపనలో శ్రీ విద్యారణ్యులు తమ తపోశక్తినంతా ధారపోసారని తెలిపారు. అటువంటి మహనీయులు ప్రాతఃస్మరణీయులనీ, వారి గురించి మననం చేసుకోవడం ప్రతి దేశభక్తుడి కర్తవ్యమనీ శైలజ గారు తమ ప్రసంగంలో పేర్కొన్నారు.
పిమ్మ, ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీ మాధవన్ గారు సమతామూర్తి, జగద్గురువులు శ్రీ రామానుజాచార్యుల గురించి మాట్లాడుతూ సా.శ. పదవ శతాబ్దంలో జన్మించిన శ్రీ రామానుజాచార్యుడు విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి అని తెలిపారు. రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు, కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చన్నారు.
మాధవన్ గారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ, శ్రీ రామానుజాచార్యుల విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయనీ, గురువుతోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి అనీ కొనియాడారు. ఆయనకు ముందు కాలం నుంచే విశిష్టాద్వైతం ఉందనీ, దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత అనీ తెలిపారు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికే విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని అంటారనీ శ్రీ మాధవన్ గారు తెలిపారు.
రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీ భాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీ రంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించి, దేశవ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహాసనాధిపులను, జియ్యంగార్లను, పరమైకాంతులను నియమించారని పేర్కొన్నారు.
అస్పృశ్యత లాంటి దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టి, తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు, నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి, శనివారం నాడు దేహ త్యాగం చేశారని తెలుపుతూ శ్రీ మాధవన్ గారు తమ ప్రసంగం ముగించారు.
ఆ తరువాత, దక్షిణాపథ తెలంగాణా ప్రాంత సంయోజకులు, శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల ప్రాభవం గురించి మాట్లాడారు. దాదాపు 13 శతాబ్దాల క్రితం సనాతన ధర్మ జ్యోతి అనేక అవైదిక మతాల పెనుగాలులకు రెపరెపలాడుతున్న సమయంలో, కేరళలోని కాలడి ప్రాంతంలో జన్మించిన సాక్షాత్ దక్షిణామూర్తి అవతారమైన శ్రీ శంకరాచార్యులు, నర్మదా నదీ తీరంలోని శ్రీ గోవిందభగవత్పాదుల వద్ద శిష్యునిగా చేరి, వేదవేదంగాలనూ, సకల శాస్త్రాలను అభ్యసించారని తెలిపారు. విద్యాధ్యయనం పూర్తవడంతోనే భారతదేశమంతటా కాలినడకన పలుమార్లు పయనించి అవైదిక మతాల వాదనలను ఖండించి, తన జ్ఞాన పటిమతో అనేకమందిని వాదనలలో ఓడించి సనాతన ధర్మాన్ని పునః ప్రతిష్టించారు. భారతదేశంలో సనాతన ధర్మం ఆచంద్రార్కం నిలిచి ఉండేలా దేశం నలుమూలలా – ఉత్తరాన బదరికాశ్రమం, దక్షిణాన శృంగేరీ పీఠం, తూర్పున గోవర్ధన పీఠం, పశ్చిమాన ద్వారికా పీఠం నెలకొల్పి వాటికి తన శిష్యులను పీఠాధిపతులుగా నియమించినారని శ్రీ చక్రవర్తిగారు తెలిపారు. ఈ పీఠాలు నేటికీ కొనసాగుతూ, ఆయా పీఠాధిపతులు సనాతన ధర్మ పరిరక్షణకు సదా మార్గదర్శనం చేస్తున్నారని వారు తమ ప్రసంగంలో తెలిపారు. కేవలం ముప్పది రెండు సంవత్సరాలే జీవించిన జగద్గురువులు వేదాలపై, ఉపనిషత్తులపై, పురాణాలపై అనేక భాష్య గ్రంధాలు రాశారు. శ్రీ ఆదిశంకరులు పునరుద్ధరించిన సనాతన ధర్మ వారసులుగా మనమందరమూ నిత్యమూ వారిని స్మరించుకోవడం మన బాధ్యతగా శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు అన్నారు.
అనంతరం, హిందూ ఈ బుక్ షాప్ తరపున శ్రీ సతీష్ గారు తమ కేంద్రంలో లభ్యమవుతున్న శ్రీ విద్యారణ్యుల, శ్రీ రామనుజుల మరియు శ్రీ ఆదిశంకరాచార్యుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలూ, వారు రచించిన గ్రంధాల గురించి వివరించారు.
చివరగా, కార్యక్రమానికి వచ్చిన వారంతా శ్రీ విద్యారణ్యుల, శ్రీ రామనుజుల మరియు శ్రీ ఆదిశంకరాచార్యుల చిత్రపటాలను పూజించారు. చివరగా శాంతి మంత్రం, ప్రసాద వితరణ తో కార్యక్రమం ముగిసింది.
వెళ్ళండి రామకృష్ణ
More Stories
CSIS highlights suffering of Bharateeya Girmityas in Guadeloupe, rooted in Madras Presidency, at Diaspora Meet in Trinidad
Musunuri Nayakulu Book Release in the Seminar Dakshinapatha Through Ages – Glory of Bharat’
Swami Vidyaranya Jayanti